Entertainment

Home » » నాగార్జున పాతికేళ్ల ప్రస్థానం

నాగార్జున పాతికేళ్ల ప్రస్థానం

vikram


మాస్‌గా విలన్లను మడతెట్టాలన్నా...బాస్‌గా అందమైన సెక్రటరీలను పడగొట్టేయాలన్నా...రామదాసుగా భక్తిరసాన్ని పొంగించాలన్నా అది నాగార్జునకే సొంతం.క్లాస్‌-మాస్‌ అనే తేడాలేకుండా తెలుగు సినీ ప్రేక్షకులచే బ్రహ్మరథం పట్టించుకుంటున్న ఏకైక ఎవర్‌గ్రీన్‌ హీరో అక్కినేని నాగార్జున. నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి నేటికి 25 సంవత్సరాలు పూర్తయింది. 23-5-1986న నాగార్జున నటించిన తొలి చిత్రం ‘విక్రమ్‌’ విడుదలయింది. ఈ 25 సంవత్సరాలలో 76 చిత్రాలలో నటించిన నాగార్జున అరుదైన పాత్రలను అలవోకగా పోషించి...నవరసపాత్రల్ని అభినయించి అభిమానులందరికీ ఆరాధ్యుడయ్యారు. అభిరుచికలిగిన నిర్మాతగా 10 అపురూప చిత్రాలను కూడా నిర్మించారు. కళామతల్లి ముద్దుబిడ్డగా తన తోటి కళాకారులను గౌరవిస్తూ... వివాదాలకు అతీతంగా తన విజయపరంపర కొన సాగిస్తున్నారు.

ట్రెండ్‌ సెట్టర్‌: వారసత్వపు హీరోగానే అడుగుపెట్టినా తన సొంత ఇమేజ్‌తోనే నటుడిగా ఎదిగారు. తొలి చిత్రం ‘విక్రమ్‌’ కమర్షియల్‌గా హిట్‌ అయినా నటుడిగా రావలసినంత ఇమేజ్‌ మాత్రం రాలేదు. ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. మొట్టమొదటిసారిగా కాలేజీ నేపథ్యంలో రూపొందిన ‘శివ’ ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. రామ్‌గోపాల్‌వర్మకు తొలిసారిగా దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడమేగాక... తన సొంత బ్యానర్‌లోనే ఆ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలోనూ శతదినోత్సవాలను జరుపుకుని ఆరోజుల్లో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. తమిళంలో ‘ఉదయం’గా డబ్‌ చేసి మొత్తం 24 కేంద్రాలలో విడుదల చేయగా అక్కడ కూడా 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అంతేకాదు 5 కేంద్రాలలో 200 రోజులు ఆడింది. చెనై్న దేవి థియేటర్‌లో ‘ఉదయం’గా డబ్‌ చేసిన శివ చిత్రం 145 రోజులు వరుసగా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడం విశేషం. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్‌గాపాల్‌వర్మ బాలీవుడ్‌లోనూ తిరుగులేని దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు.

నవరసాభినయం: కేవలం 25 సంవత్సరాల నాగార్జున నటప్రస్థానంలో నవ రసాలు అద్భుతంగా పోషించగలిగే పాత్రలు లభించాయి. ఇది ఏ నటుడికీ దక్కని అరుదైన అవకాశం. ‘‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’, ‘మన్మధుడు’ చిత్రాలలో చక్కని శృంగార రసం పోషించి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇక ‘మాస్‌’, ‘రగడ’ లాంటి చిత్రాలలో వీరరసం పోషించారు. ‘గీతాంజలి’, ‘మజ్ఞు’ లాంటి చిత్రాలతో హృదయాలను కరిగించే కరుణరసాన్ని పండించారు. ‘హలోబ్రదర్‌’, ‘కింగ్‌’ లాంటి చిత్రాలతో హాస్యరసాన్ని అందించారు. ‘శివ’ ‘కిల్లర్‌’ లాంటి చిత్రాలతో రౌద్రరసాన్ని పండించారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి చిత్రాలతో భక్తిరసాన్ని పండించారు. ‘సంతోషం’ లాంటి చిత్రంతో శాంతరసాన్ని, ఇలా తను నటించిన ప్రతి పాత్రనూ ఎంతో అద్భుతంగా పోషిస్తూ అద్భుతరసాన్ని కూడా తన పాత్రలతో పలికిస్తున్నారు. నటుడిగా లెక్కలేనన్ని రివార్డులు, అవార్డులు అందుకున్నారు.
ragada
నిర్మాతగా విభిన్న చిత్రాలు : ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ఆస్వాదించే నాగార్జున విభిన్న కథాంశాలతో కూడిన వినూత్న చిత్రాలను నిర్మాతగా రూపొందించారు. తాను నటించకపోయినా మేనల్లుడు సుమంత్‌తో ‘సత్యం’ చిత్రాన్ని రూపొందించారు. అలాగే తన చిన్నకొడుకు అఖిల్‌ను హీరోగా చేసి అతనికి ఏడెనిమిది నెలల వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రాన్ని తీసి చక్కని విజయం సాధించారు. ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రం ద్వారా చక్కని కుటుంబ సందేశాన్ని అందిస్తూ మంచి వినోదాత్మక చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగానే కాకుండా నటుడిగానూ ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు ముందు వరసలో ఉంటారు అక్కినేని నాగార్జున. కేవలం మూస పాత్రలు, రొటీన్‌ ఫార్ములా పాత్రలలో నటించేందుకు నాగార్జున అంగీకరించరు. రీసెంట్‌గా విడుదలైన ‘గగనం’ చిత్రం ఇందుకు ఉదాహరణ. అప్పట్లో ‘అంతం’ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరో క్యారెక్టర్‌ చేసి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నారు. అందుకే ‘మాస్‌’ సినిమాలోనటించినా దానికి విభిన్నరీతిలో ‘శ్రీరామదాసు’ చిత్రంలో నటించి ఔరా ఆనిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మళ్లీ షిరిడీ సాయిబాబాగా కనువిందు చేయనున్నారు. అంతేకాదు ‘రాజన్న’ అనే ఓ చారిత్రాత్మక చిత్రంలో, ‘డమరుకం’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తూ వరసగా వైవిధ్యమైన పాత్రల్లో పరకాయప్రవేశం చేస్తున్న నాగార్జున బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు.

నాడు ‘విక్రమ్‌’ సినిమా చూసి నాగార్జున నటనకు పనికిరాడు అన్నవారే ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ పాత్రల్లో నాగార్జున నటనను చూసి నోరెళ్లబెట్టారు. తాము ఎంత తప్పుగా అంచనా వేశామో వారికి అప్పుడుగాని అర్థం అయివుంటుంది. ఇలా నాగార్జున నట ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.
Share this article :

0 comments:

Blog Archive

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. star cinema - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger